శ్రీ మహా పంచముఖేశ్వర స్వామి వారి చరిత్ర
కాండ్రపాడు గ్రామంలోని పవిత్ర పంచముఖేశ్వర క్షేత్ర చరిత్ర
ఆడియో
ఆలయ చరిత్ర వినండి
ఆలయ చరిత్ర ఆడియోను వినండి లేదా డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆవిర్భావం మరియు స్థలపురాణం
కాండ్రపాడు గ్రామం, చందర్లపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఈ పంచముఖేశ్వరుడు 1937వ సంవత్సరం, ఈశ్వర నామ సంవత్సరం, ఏప్రిల్ 15, చైత్ర శుద్ధ పంచమి, మృగశిర నక్షత్రం, గురువారం ఉదయం 10 గంటలకు పాటిమన్ను తవ్వుతుండగా బయటపడ్డారు. ఈ శివలింగంతో పాటు గుడికి నాలుగు దిక్కులా దర్శనమిచ్చే నాలుగు శివలింగాలు, రాతి ఫలకం కూడా ఆనాడు బయటపడ్డాయి. ఈ రాతి ఫలకం విగ్రహ ప్రతిష్ఠా సమయంలో వేయబడిన యంత్రంగా చెప్పవచ్చు.
2002వ సంవత్సరంలో నూతన ఆలయాన్ని నిర్మించి, రాజరాజేశ్వరి అమ్మవారిని, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి జీర్ణోద్ధరణ కార్యక్రమం జరిపించారు.
దివ్య ఆవిర్భావ తేదీ
గురువారం, ఏప్రిల్ 15, 1937
ఈశ్వర నామ సంవత్సరం, చైత్ర శుద్ధ పంచమి, మృగశిర నక్షత్రం, ఉదయం 10 గంటలకు
చారిత్రక ఆధారాలు
ఈ ప్రదేశాన్ని చాగి వంశపు రాజులు పరిపాలించినట్లు 1155వ నాటి శాసనం ద్వారా తెలుస్తుంది. వారి రాజధాని దగ్గరలోనున్న గుడిమెట్ట గ్రామం. ఈ చాగి వంశపు రాజులు కాకతీయ రాజ్య సామంతులుగా పరిపాలించేవారు. చాగి వంశపు రాజు అయిన పోతరాజు ఈ పంచముఖేశ్వరుడిని ప్రతి రోజు దర్శించుకునేవాడు. భీమకవి శాపం వలన రెండు గ్రామాల మధ్యనున్న వాగు వద్ద గుర్రం మీద వెళుతుండగా శత్రువుల దాడి ఫలితంగా మరణించాడు.
రాయ గజ కేసరి అయిన రాణి రుద్రమదేవి ఈ ప్రదేశానికి వచ్చి హవిర్భిల్వార్చనకు, అఖండ దీపారాధనకు బేతవోలు, జగ్గయ్యపేట గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు గుడిమెట్టలో దొరికిన శాసన ఆధారాల ద్వారా తెలుస్తుంది.
శాతవాహన, ఇక్ష్వాక, కాకతీయ, విజయనగర మరియు రెడ్డి రాజుల కాలం సైతం ఇచ్చట పరిపాలన సాగినట్లు తెలుస్తుంది. అందువలన 11వ శతాబ్దం నాటికే ఇక్కడ స్వామివారు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రాచీన గుడి ఆనవాళ్లు మాత్రం ఇక్కడ లభించలేదు, కానీ ఇప్పుడు ఉన్న ఆలయానికి వాయువ్యం వైపు శిధిలమైన కోనేరు మాత్రం ఉండేది.
చారిత్రకంగా సంబంధం ఉన్న రాజవంశాలు
11వ శతాబ్దం నాటికే ఇక్కడ స్వామివారు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రాచీన ఆలయ నిర్మాణ ఆనవాళ్లు మాత్రం లభించలేదు.
పంచముఖ లింగం ప్రత్యేకత
సాధారణంగా పంచముఖ ఆలయాలలో నాలుగు ముఖములతో స్వామివారు దర్శనమిస్తారు. ఐదవ ముఖం అంతర్ముఖముగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాలలో అది లింగానికి పైభాగంలో కానీ, లింగానికి ఈశాన్య ముఖముగా కానీ చిత్రీకరించబడుతుంది.
అరుదుగా కనిపించే ఐదు ముఖములతో ఇక్కడ ఉన్న పంచముఖేశ్వరుడు దర్శనమిస్తారు. ఈ ఐదు ముఖములు లింగానికి ఐదు దిక్కుల వైపు ఉంటాయి - తూర్పు, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్య ముఖములతో ఇక్కడ ఉన్న స్వామివారు దర్శనమిస్తారు. ఇదే ఇక్కడ ఉన్న లింగం విశిష్ఠత.
పంచముఖ లింగం విశిష్ఠత
- •ఐదు ముఖములతో దర్శనమిచ్చే అరుదైన పంచముఖ లింగం
- •తూర్పు, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్య దిక్కుల వైపు ముఖాలు
- •ఇతర పంచముఖ ఆలయాలలో కనిపించే సాధారణ రూపంతో పోల్చితే ప్రత్యేకమైన రూపం
ఇటీవలి అభివృద్ధులు
1937 నాటి ఆవిర్భావం తర్వాత నిర్మించిన ప్రాథమిక ఆలయం నుండి నేటి దేవస్థానం వరకు, భక్తుల నిరంతర సమర్పణ మరియు దేవస్థాన ట్రస్ట్ మార్గదర్శకత్వంలో ఆలయం అభివృద్ధి చెందింది.
- 1937
ప్రాథమిక ఆలయం
పంచముఖ లింగం ఆవిర్భావం తర్వాత, నిత్య ఆరాధన జరగడానికి ఆ స్థలంలో ప్రాథమిక ఆలయ నిర్మాణం జరిగింది.
- 2002
నూతన ఆలయం
నూతన ఆలయాన్ని నిర్మించి, రాజరాజేశ్వరి అమ్మవారిని, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి జీర్ణోద్ధరణ కార్యక్రమం జరిపించారు.
- 2020
శ్రీ రంగ నాయక కళ్యాణ మండపం
వివాహాలు, ఉపనయనాలు మరియు ఇతర ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు అనువైన శ్రీ రంగ నాయక కళ్యాణ మండపం దేవస్థానం ఆవరణలో నిర్మించబడింది.
- 2024
తూర్పు రాజ గోపురం మరియు శ్రీ విజయ గణపతి ఆలయం
నూతన తూర్పు రాజ గోపురం మరియు శ్రీ విజయ గణపతి స్వామి ఆలయం ప్రతిష్ఠించబడ్డాయి. ఇవి దేవస్థాన అభివృద్ధిలో ముఖ్యమైన సోపానాలు.
- ఇప్పుడు
ఆలయ అభివృద్ధి పనులు
ఆలయ మండపం విస్తరణ సహా పలు నిర్మాణ మరియు పునరుద్ధరణ పనులు నిరంతరం జరుగుతున్నాయి.
దేవతల దర్శనాలు, ఆలయ సముదాయం, పండుగలు మరియు ఇటీవలి అభివృద్ధులకు సంబంధించిన ఫోటోలు చూడాలంటే గ్యాలరీ పేజీ సందర్శించండి.
గ్యాలరీ చూడండి →